Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు,రామలక్ష్మి దంపతులు తమ రచనా వ్యాసంగానికి స్వీకరించిన కలం పేరు 'వసుంధర'. రాజగోపాలరావుగారు వృత్తిరీత్యా సైంటిస్ట్, రామలక్ష్మిగారు గృహిణి. ఇప్పటికి వీరు సాంఘిక, క్రయిమ్ విభాగంలో వెయ్యికి పైగా కథలు, రెండువందల యాభైకి పైగా నవల - నవలికలూ రాశారు. వివిధ పత్రికలు నిర్వహించిన కథలు, నవలల పోటీలలో పలుమార్లు అనేక బహుమతులు పొందారు.
వీరి రచనలు కొన్ని సినిమాలుగా రాణించాయి. కొన్ని సినిమాలకు, టీ.వి. ఎపిసోడ్సుకీ పనిచేశారు. వీరి రచనలు కొన్ని హిందీ, కన్నడ, ఆంగ్లభాషలలోకి అనువదించబడి పాఠకాదరణ పొందాయి. ఇతరత్రా 150కి పైగా సాహితీవ్యాసాలు, 125కి పైగా పుస్తక సమీక్షలు రాశారు.
1971 నుంచి 'చందమామ' బాలల మాసపత్రిక కొనసాగినంతకాలం ఇంచుమించు ప్రతినెల వీరి రచనలు చోటుచేసుకొన్నాయి. 1988 నుంచి 1999 వరకు 'బొమ్మరిల్లు' పిల్లల మాసపత్రిక నిర్వహించారు. 1973 నుంచి 1988 వరకూ అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రతి నెలా వీరి కథలు, నవలలు ప్రచురించబడేవి. 1991 నుంచి 'నిషిద్ధాక్షరి', 'సాహితీవైద్యం', 'దొరకునా ఇటువంటి సేవ' వగైరా వినూత్న శీర్షికలకు శ్రీకారం చుట్టారు. ఔత్సాహిక రచయితలకు, సాహిత్యాభిమానులకు ఉపయుక్తంగా ఉండేలా 'సాహితీవైద్యం' శీర్షిక నేటికీ కొనసాగుతోంది.
సాహిత్యాభిమానులకూ, రచయితలకూ ఆసక్తికరమైన విశేషాలతో - ఆంగ్లంలో Flat Forum అనే బ్లాగునీ, తెలుగులో అక్షరజాలం అనే బ్లాగు, వెబ్ సైట్ లనీ నిర్వహిస్తున్నారు. సమాజంలో వినోద, విషాదాలకు దారితీసే ప్రతి ఘటన వెనుకా, సమస్య వెనుకా - మనిషి ఆలోచనా విధానం, దృక్పథం ఉంటాయని వీరి ప్రగాఢ విశ్వాసం. మానసిక విశ్లేషణతో మనుషుల్ని అధ్యయనం చేసి ఆ ఫలితాలను రచనలుగా పాఠకుల ముందుంచటం వీరికి ఇష్టమైన ప్రక్రియ.