1750 - 1810 ప్రాంతాల్లోని పరిస్థితులను ఆవిష్కరిస్తూ 'అనంతపురం చరిత్ర' రచన మొదట తెలుగులో రాయబడింది. దీనిని సేకరించిన కల్నల్ కాలిన్ మెకంజీ మద్రాసులోని కాలేజీ లైబ్రరీలో పదిలపర్చాడు. అక్కడ ఈ ప్రతిని చూసిన సి. పి. బ్రౌన్ 1853 సంవత్సరంలో 'WARS OF THE RAJAS BEING THE HISTORY OF ANANTAPURAM' గా ఇంగ్లీష్ లోకి అనువాదం చేసి ప్రచురించాడు. అదే సందర్భంలోనే తెలుగు ప్రతి కూడా ముద్రించబడింది. ఇప్పుడు ఆనాటి తెలుగు ముద్రణ ప్రతిని యథాతథంగా తీసుకొస్తున్నాం. 265 సంవత్సరాల క్రితం నాటి అనంతపురం ప్రాంతంలోని ప్రజల జీవన జీవిత విధానంను ఈ రచన ప్రతిబింబిస్తుంది. ఆనాటి సాంఘిక ఆర్థిక, రాజకీయ సామాజిక పరిస్థితులను కళ్ళ ముందుకు తీసుకొస్తుంది. తిరుమల రాయల రణభేరి, హండే హనుమప్పనాయుడి కుమారుడు హంపానాయుడు రాజ్యాభిషేకం, మలకప్ప నాయుడు బుక్కరాయ సముద్రం చేరడం, శిద్దరామప్పనాయుడి వృత్తాంతం, బళ్ళారి కోట నుంచి శ్రీ రంగపట్నం చెరసాల వరకు వంటి ఎన్నో చారిత్రక సంఘటనలు చరిత్రకు కొత్త దారిని వేస్తాయి. సజీవ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తాయి.
- డా. వేంపల్లి గంగాధర్