Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
తెలుగు నవలా సాహిత్యంలోకి ఒక అక్షరక్షిపణిలా ప్రవేశించి యిప్పటికే మూడునాలు తరాలను ప్రభావితం చేసిన నవల "అంపశయ్య”. నూతన సహస్రాబ్దిలోకి ప్రవేశించబోతున్న చారిత్రాత్మక సందర్భంలో వెయ్యేళ్ళ మన తెలుగు సాహిత్యంలో వెలువడిన వేలాది గ్రంథాల్లో నుండి వంద 'ఆణిముత్యాలను' గుర్తించి సాహిత్యప్రియులకు తెలియజేయాలని నిష్ణాతులైన అబ్బూరి ఛాయాదేవి, రావూరి భరద్వాజ, నండూరి రామమోహనరావు, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, సింగమనేని నారాయణ, వేగుంట మోహనప్రసాద్, ఎల్లూరి శివారెడ్డి, చేకూరి రామారావు వంటి ఉద్దండులు నలభై నాల్గు మందితో ఒక బృందాన్ని ఏర్పర్చి 'ఆంధ్రజ్యోతి' ఒక బృహత్తర ఎంపిక కార్యక్రమాన్ని చేపట్టింది. వాళ్లు చాలా జాగ్రత్తగా, నిశితంగా పరిశీలించి ఆంధ్ర మహాభారతం (కవిత్రయం ), కన్యాశుల్కం, మహా ప్రస్థానం, చివరకు మిగిలేది, అమృతం కురిసిన రాత్రి, మైదానం వంటి వంద గ్రంథాలను తెలుగు జా సంపదగా ప్రకటించారు. వాటిలో మన నవీన్ రాసిన 'అంపశయ్య' నవల వరుస క్రమంలో నలభై తొమ్మిదవ ఆణిముత్యంగా, ఉత్తమ గ్రంథంగా గుర్తించబడి సుస్థిరమైన, మనందరం గర్వించదగ్గ స్థానాన్ని పదిలపర్చుకుంది. ఇది వరంగల్లు మహానగరానికి తెలుగు భాషా చరిత్రలో దక్కిన ఒక అపురూప గౌరవం.
ఆ రకంగా... గెలిచి నిలిచి లక్షలాదిమంది పాఠకులను ఉర్రూతలూగించిన 'అంపశయ్య' నవల యిప్పుడు పన్నెండవ ముద్రణగా వెలువడున్న సందర్భంగా.... ఒక సహరచయితగా గర్విస్తూనే... నవీన్ గారిని అభినందిస్తున్నాను,
-రామా చంద్రమౌళి