అన్నిటికి కారకుడు మనిషి కనుక ప్రతి మనిషిలో నన్ను చూసుకోవడం నాకెంతో ఇష్టం. మనిషి ఎక్కడ వున్నా ఒకడే. వృద్వితలం పై మనిషి అడుగుల చప్పుడు వినపడిన తొలిక్షణం నుంచి మనిషి అంతరాత్మ ఒకటే. నేను ప్రతి మనిషిలో వుంటాను. ప్రతి మనిషి స్వప్నంలో వుంటాను. స్వప్న సౌందర్యంలో వుంటాను. బాధలో, దుఃఖంలో మండుతున్న గాయాలలో వుంటాను. ఎడారిలో మనిషి అక్రాందన లో వుంటాను. అథః పతితుడైన మనిషిని ఆప్యాయంగా లేవనెత్తుతున్న కారుణ్య హస్తాలలో వుంటాను. అక్షరాలకు సంకెళ్లు లేవు. భూగోళం పై సరిహద్దులు లేవు. మనిషి ఆత్మ ప్రకంపన ఒక్కటే అతడు మాట్లాడే భాషకు ఆయువుపట్టు. ప్రతి అక్షరం ఒక మనిషి. ప్రతి మనిషి ఒక అక్షరం. దైనందిన జీవన బీభత్సంలో నేను చేస్తున్న విచిత్ర విన్యాసాలే నా కొత్త ఛందస్సు.