బాలబాలికల్లోని సృజనను జాగృతం చేయాలి - ఉపాధ్యాయులు అందుకనుగుణంగా మారాలి. దేశభక్తిని, ప్రకృతి ఆరాధనను, వృత్తి గౌరవాన్ని పెంచుకోవాలి.
కంఠస్థం, వల్లె వేయించడం కంటే ప్రజ్ఞను, మానసిక పరిపక్వతను పెంపొందించడానికి ఉపాధ్యాయులు ప్రాధాన్యాన్నివ్వాలి.
ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి కావాలి. నిరహంకారంతో విద్యార్థులతో స్నేహభావంతోమెలుగుతూ, విశ్వమానవ సౌభ్రాత్రత పెంచాలి.
విద్య ఆత్మగౌరవాన్ని, మర్యాదను పెంచి పోషించాలి. అందుకు ఉపాధ్యాయులు బాధ్యత వహించాలి.
సాహిత్యం పై తపన, ప్రేమ వున్న సృజనశీలుర అభివ్యక్తి భిన్నరూపాల్ని సంతరించుకుంటుంది. వారు ఏదో ఒక ప్రక్రియకు పరిమితం కారు. ఏకకాలంలో తమ వ్యక్తీకరణకు అనువైన పలు ప్రక్రియల్ని ఎంచుకొని సృజనాత్మక కృషిని కొనసాగిస్తుంటారు. ఈ కోవకు చెందిన విశిష్ట రచయిత, కవి దోరవేటి. సునిశితంగా పరిశీలించడం, వెనువెంటనే స్పందించడం, తన ఆలోచనలకు సాహిత్యరూపాన్ని అందించడానికి సమయోచితంగా పూనుకోవడం ఈ రచయిత లక్షణాలు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కథామాలిక ఉపాధ్యాయ వృత్తికి రచయిత చేస్తున్న సత్కారం.