Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
భారతిగారు ఈ పోరాట కథనానికి కన్నడంలో 'సాసివె తందవళు' అన్న అద్భుతమైన శీర్షిక ఇచ్చారు. గౌతమబుద్దుని ఒకానొక కథ సారాంశం ఆధారంగా మరణాన్ని ఎదిరించి గెలిచిన ఇంటి నుండి చివరికి 'ఆవాలు తెచ్చిన మహిళ' అన్న భావం స్ఫురించే పేరిది. బుద్దుని కథలో చావులేని ఇల్లు ఎక్కడా వుండదని తెలుసుకుని, అలాంటి ఇంటి నుంచి 'ఆవాలు తేలేకపోయిన మహిళ' కథ యొక్క శీర్షిక, ఇక్కడ మనకు మరో కోణంలో కొత్త అర్థాన్ని స్ఫురించే విధంగా వాడబడింది. మన అంతరంగపు సంఘర్షణల వాస్తవ చిత్రాన్ని, అదే సమయంలో పాఠకులకు చెప్పాల్సిన బాహ్య ప్రపంచపు వివరణలనూ, ఒక్క తాటి పై నేర్పుగా నింపే ప్రభావవంతమైన గద్యం, భారతిగారి రచనా సామర్థ్యం అపురూపమైనదని నాకనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో నేను చదివిన అత్యుత్తమమైన గద్యరచనలలో ఈ పుస్తకాన్ని తప్పకుండా పేర్కొనగలను. తన అంతరంగంలో జరుగుతున్న అసహనీయమైన యాతనా కథనాన్ని, అలాగే ఆ యుద్దాన్ని ఎదుర్కొని గెలిచే జీవనోత్సాహపు దివ్యక్షణాలనూ, ఈ రెండూ భిన్న పార్శ్వాలనూ ఒకే సమయంలో మనముందు నిలిపే ఈ కథ నిజజీవితపు కఠోర వాస్తవ చిత్రణ. అదే సమయంలో ఇదొక కథలాగా, కవితలాగ శక్తి వంతమైన కాల్పనిక సాహిత్య సృజన కూడా అనిపిస్తుంది.
-డా. యు .ఆర్.అనంతమూర్తి