Welcome To Mrit Books ,A Room Without Book Like A Body Without a Soul.
కేశవ్ కథలలో అసాధారణ పాత్రలు లేవు. అసాధారణ సంఘటనలు లేవు. అసాధారణ కథన పద్ధతి లేదు. ఆయన వస్తుస్వీకరణలోనూ, శిల్ప నిర్మాణంలోనూ వాస్తవిక వాద రచయిత. సాహిత్యం మనిషిని మారుస్తుంది. అనే నమ్మకం ఉన్న రచయితగా తన కథలలో అనేక పర్యాయాలు సాహిత్య గ్రంథాల, రచయితల ప్రస్తావన తెచ్చారు. అధ్యాపకుడు కథా రచయిత అయితే, కథాకథనం ఎలా ఉంటుందో కేశవ్ కథాకథనం అలా ఉంది. తరగతి గదిలో విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పినట్టు, పాఠకులను ఇబ్బంది పెట్టని కథన పద్ధతి కేశవాది. - డా॥ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ఈ కథలన్నీ మన సమకాలీన సమాజంలో రోజురోజుకు పరిస్తితులెలా మారిపోతున్నాయో చిత్రించాయి. స్వార్థపరత్వం, ఆడంబరత, కృత్రిమత్వం, యాంత్రికత్వం మొదలైనవన్నీ స్వచ్చమైన మానవత్వాన్ని ఎలా మరుగుపరుస్తాయో చెప్పాయి. సహజమైన, నిరాడంబరమైన, ఎలాంటి ఆర్థికవ్యత్యాసాలు లేని ఆకలి, దోపిడీ లేని సమసమాజమేర్పడాలన్న గొప్ప అభ్యుదయ దృక్పథంతో ఈ కథలు రచించిన కేశపు హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. - అంపశయ్య నవీన్ కథలు గాల్లో పుట్టవు. ఆకాశం నుండి ఆకస్మాత్తుగా ఊడిపడవు. మనిషి జీవితంలో చుట్టూ జరిగే సంఘర్షణల నుండి; అలజడుల నుండి హృదయంలో కలిగే ప్రతిస్పందనలు అక్షరాలై భావోద్వేగాలతో పురుడుపోసుకుంటాయి. అలాంటి భావోద్వేగాల, సంఘటనల, అలజడుల సమాహారమే కేశవ్ పదహారు కథలుగా గత మూడు దశాబ్దాల నుండి రూపుదిద్దుకున్నాయి. ఒక ఉపాధ్యాయుడు, ఒక ఆర్థిక విశ్లేషకుడు, ఒక కథా రచయిత కలగలిస్తే ఎంత మంచి సృజన కాగలదు అనడానికి నిదర్శనమే ఈ కథలు. - సర్వమంగళ |