తెలంగాణ సమస్యల పై తీర్పు చెప్పటమంటే ఒక మానవీయ కోణంలో అర్థం చేసుకొని న్యాయం చెప్పాలి. అంటరానితనం లాగే వెనకబాటు తనం కూడా వెలకట్టలేనంత బాధల మూట అది. తెలంగాణ చరిత్రంతా అణిచివేతలకు గురైన చరిత్ర. అణచివేతనుంచి తనకు తాను బయటపడేందుకు పోరాటాల పెనుగులాటలలోనే తెలంగాణ జీవన్మరణ సమస్యగా మారింది. తెలంగాణ ప్రజలు తమ నేలను తాము కోరుకుంటున్నారు. తమ స్వపరిపాలన తమకు కావాలంటున్నారు. తమ నిధులపైన తమకే అధికారం కావాలంటున్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో దగా జరిగిందని తెలంగాణ దండోరా వేసింది. ప్రశాంతంగా వుండాల్సిన తెలంగాణ నేల ఎందుకు పొక్కిలయ్యిందో తెలంగాణ చరిత్ర పేజీలు తిరగేస్తే తెలుస్తుంది.
- జూలూరు గౌరీశంకర్